: కమలహాసన్ తన ఆస్తులను ఇద్దరు కూతుర్లకు సమానంగా పంచారా?...వైరల్ అవుతున్న కమల్ వీలునామా
భారతీయ సినీ పరిశ్రమ విశిష్ట విలక్షణ నటుడిగా కీర్తించే కమలహాసన్ తన ఆస్తులను తన ఇద్దరు కుమార్తెలకు సమానంగా పంచేశారా? అంటే స్పష్టమైన సమాధానం తెలియనప్పటికీ, తమిళ మీడియాలో మాత్రం ఓ ప్రచారం ఊపందుకుంది. కమలహాసన్ తన ఆస్తిని శ్రుతి హాసన్, అక్షర హాసన్ లకు చెరిసగం చెందేలా వీలునామా రాసినట్టుగా ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ కాలం పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రపరిశ్రమల్లో కమల హాసన్ నటుడిగా కొనసాగుతుండగా, తెలుగు, తమిళంలో పలు సినిమాలకు దర్శక, నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు.
ఈ సమయంలో ఆయన సినిమాలు కొన్ని పరాజయం పాలయ్యాయని, ఇతర నటీనటులలా ఆయన డబ్బు కూడబెట్టుకోలేదని అంటారు. గతంలో ఈ విషయంపై కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ, తన మిత్రుడు కమల్ కి డబ్బు వెనకేసుకోవడం తెలియదని బహిరంగంగానే వాఖ్యానించారు. ఇప్పుడు ఆయన తనకున్న ఆస్తులను కుమార్తెలిద్దరికీ చెరిసమానంగా పంచుతూ వీలునామా రాశారని తెలుస్తోంది. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన ముందు జాగ్రత్తగా ఈ పని చేసినట్టు ప్రచారం జరుగుతోంది.