: బాప్‌రే!.. అంత వేగమా?.. నిషిత్ కారు ప్రమాదంపై ఆశ్చర్యపోయిన బెంజ్ ప్రతినిధులు!
నిషిత్ కారు ప్రమాదం నేపథ్యంలో వాస్తవాలను పరిశీలించేందుకు జర్మనీ నుంచి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ప్రతినిధులు గురువారం జూబ్లీహిల్స్‌లోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జపాన్, హాంకాంగ్, ఢిల్లీ, పుణెకు చెందిన బెంజ్ కార్ల నిపుణులు, ఓ లీగల్ అడ్వైజర్‌తో కూడిన పదిమంది సభ్యుల బృందం ప్రమాద స్థలికి చేరుకుని వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతకు కారు నుజ్జు నుజ్జు అయిన విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రమాద సమయంలో కారు 210 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు. ‘వామ్మో! అంత స్పీడా!’ అని ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్‌లో అంతవేగం ఎలా సాధ్యపడిందని ఆరా తీశారు.
అయితే ప్రమాదం జరిగింది తెల్లవారుజామున కావడంతో ట్రాఫిక్ ఉండదని పోలీసులు వారికి వివరించారు. మెట్రో పిల్లర్ నిర్మాణం, మూలమలుపు, వర్షం కురిసిన సమయంలో రోడ్డు పరిస్థితి తదితర వివరాలను మెట్రో అధికారుల నుంచి సేకరించారు. అనంతరం బోయిన్‌పల్లిలోని బెంజ్ షోరూంకు వెళ్లి అక్కడి మెకానిక్‌లతో మాట్లాడారు. నిషిత్ కారు వేగం గంటకు 80-120 కిలోమీటర్ల మధ్య ఉన్నట్టయితే ఆయన బతికి బయటపడే అవకాశం ఉండేదని ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. కారులోని సెక్యూరిటీ సిస్టం, ఎయిర్‌బ్యాగ్స్, సీటు బెల్టులు సరిగానే పనిచేస్తున్నాయని, మితిమీరిన వేగం వల్లే నిషిత్ ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.