: పాకిస్థాన్‌కు షాక్ తగిలింది: డాన్ పత్రిక
పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పునివ్వడంతో తమ దేశానికి షాక్ తగిలినట్లు అయిందని పాక్ పత్రిక డాన్ పేర్కొంది. అంతర్జాతీయ న్యాయస్థాన నిర్ణయం తమ దేశానికి దిగ్భ్రాంతి, అసంతృప్తిని కలిగించిందని తెలిపింది. అయితే, పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై స్టే విధించే అధికారం ఆ న్యాయస్థానానికి లేదని పాక్ విశ్లేషకులు అంటున్నారని పేర్కొంది. పాకిస్థాన్ తరఫున వాదించిన వారు సమర్థవంతంగా వాదనలు వినిపించలేకపోవడంతోనే ఆ తీర్పు ఇండియాకు అనుకూలంగా వచ్చిందని పేర్కొంటున్నారని ఆ పత్రిక తెలిపింది.
అసలు అంతర్జాతీయ న్యాయస్థానం ముందు హాజరై, తమ దేశం తప్పుచేసిందని పాక్ రిటైర్డ్ జస్టిస్ షాయిఖ్ ఉస్మానీ అన్నారు. ఇక ఆ న్యాయస్థానంలో స్టే కొనసాగినంత కాలం జాదవ్‌కు మరణశిక్ష అమలు చేయడానికి వీలులేదని చెప్పారు. ఈ కేసులో తమ న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించలేకపోయారని ఆయన విమర్శించారు. ఐసీజే నిర్ణయానికి చట్టబద్ధంగా కట్టుబడాల్సిన అవసరం లేదని తమ దేశ విశ్లేషకులు భావిస్తున్నట్లు డాన్ తెలిపింది. అయితే, నైతికంగా మాత్రమే అమలు చేయాల్సివుంటుందని అంటున్నారని పేర్కొంది.