: పాకిస్థాన్ కు షాక్... కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్షపై స్టే విధించిన అంతర్జాతీయ న్యాయస్థానం!


గూఢచర్యం ఆరోప‌ణ‌ల‌పై భార‌త నౌకాద‌ళ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాకిస్థాన్ ఆర్మీకోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించిన విష‌యంపై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ రోజు మధ్యంతర తీర్పు వెలువ‌డింది. 'ది హేగ్' ‌నగరంలోని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ తీర్పును 11 మంది న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసు అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న వాదనలు సరికావని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అన్నారు. పాక్ ఆర్మీ విధించిన ఈ మరణ శిక్ష తీర్పుపై స్టే విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

జాద‌వ్ అరెస్టు భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య వివాదాస్ప‌దమైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో భార‌త్ అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింద‌ని వివ‌రించారు. పాక్ ఈ కేసులో తెలుపుతున్న అభ్యంత‌రాల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను క‌లిసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని తెలిపారు. వియన్నా ఒప్పందంలో భారత్, పాకిస్థాన్ లు భాగస్వాములని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదన్న పాకిస్థాన్ వాదనను తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ లో జాదవ్ ను కలుసుకునేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పారు.

భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేయ‌డంతో ఇటీవ‌లే అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూష‌ణ్ జాదవ్ ఉరిశిక్షపై స్టే వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితం భార‌త్, పాకిస్థాన్‌లు అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో త‌మ త‌మ వాద‌న‌లు వినిపించగా ఈ కేసుకి అవ‌స‌ర‌మైన ఆధారాల‌ను పాకిస్థాన్ స‌మ‌ర్పించ‌లేక‌పోయింది. దీంతో భార‌త్‌కు అనుకూలంగానే ఈ తీర్పు వ‌చ్చింది.

  • Loading...

More Telugu News