: పాక్ లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కుల్ భూషణ్ జాదవ్ పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కాసేపట్లో తీర్పు
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయనపై గూఢచారి అనే ముద్రవేయడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇటీవలే అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై స్టే వచ్చింది. ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ అంశంపై తీర్పు వెలువడనుంది. రెండు రోజుల క్రితం భారత్, పాకిస్థాన్‌లు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ తమ వాదనలు కూడా వినిపించాయి. ఈ కేసులో మరికాసేపట్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి తీర్పు వస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పాక్ సరైన ఆధారాలు సమర్పించలేకపోయిన నేపథ్యంలో భారత్‌కు అనుకూలంగానే ఈ తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఈ తీర్పును అనుసరించి భారత్ కుల్ భూషణ్ జాదవ్‌ను భారత్ కు రప్పించే అంశంలో తదుపరి నిర్ణయం తీసుకోనుంది.