: 'మొద్దులా ఉన్నానని...సినిమాలకు పనికి రానని' రాసినవాళ్లంతా ఎక్కడున్నారో!: సునీల్ షెట్టి
చెక్క మొద్దులా ఉన్నానని, ముఖంలో భావాలు పలకడం లేదని, సినిమాలకు పనికిరానని తన కెరీర్ ఆరంభంలో చాలా మంది విమర్శించారని బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి గుర్తు చేసుకున్నాడు. 1992లో 'బల్వాన్' సినిమాతో బాలీవుడ్ కు సునీల్ షెట్టి పరిచయమయ్యాడు. ఈ చిత్రాన్ని చూసిన అనంతరం తాను బాలీవుడ్ కు పనికిరానని పలువురు తమ రివ్యూల్లో రాసుకొచ్చారని తెలిపాడు. నటనకు స్వస్తి చెప్పి రెస్టారెంట్ బిజినెస్ చూసుకుంటే మంచిదని సలహా కూడా ఇచ్చారని సునీల్ షెట్టి తెలిపాడు.
అప్పట్లో అలా రాసిన వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ... తాను మాత్రం గత 26 ఏళ్లుగా సినీ పరిశ్రమలోనే ఉన్నానని అన్నాడు. సినీ నటుడు ప్రతి రోజును అనుభవం సంపాదించే అవకాశంగా భావించాలని తెలిపాడు. తాను ఇఫ్పటికీ ప్రతిరోజూ కెమెరా ముందుకు విద్యార్థిలా వెళ్తానని అన్నాడు. కెమెరా ముందుకు వెళ్లాక నేర్చుకునేది ఉంటుందని తెలిపాడు. ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకుంటేనే ముందుకు సాగగలమని సునీల్ షెట్టి తెలిపాడు. కాగా, సునీల్ షట్టి ఖాతాలో 'దిల్ వాలే', 'బోర్డర్', 'ధడ్కన్' వంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఎన్నో మల్టీ స్టారర్ సినిమాల్లో సునీల్ షెట్టి నటించాడు.