: కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. నరేంద్ర మోదీ క్యాబినెట్ లో పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 1956 జూలై 6న మధ్యప్రదేశ్ లోని బాద్ నగర్ లో జన్మించిన ఆయన, ఇండోర్ లోని గుజరాతీ కాలేజీ నుంచి ఎంకామ్ విద్యను అభ్యసించి, ఆపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరి రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు.
నర్మదా నదిని బహుళ ప్రయోజనకారిగా చేయాలన్న ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 2009లో తొలిసారి రాజ్యసభకు ఎంపికైన ఆయన, నీటి వనరుల కమిటీ, సమాచార, ప్రసారాల శాఖ కమిటీ, వాతావరణ మార్పులపై అధ్యయన కమిటీ సహా పలు కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. గత సంవత్సరం జూలై 5న నరేంద్ర మోదీ, తన క్యాబినెట్ ను విస్తరించగా, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా దవే బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.