: టాప్ గేరులో ఏపీఎస్ఆర్టీసీ.. విభజన తర్వాత నష్టాల నుంచి తొలిసారి లాభాల్లోకి!


ఆర్టీసీ అంటేనే... ఎప్పుడూ నష్టాల్లో నడిచే సంస్థ అని అందరి భావన. ఇది నిజమే. ఇటు ఏపీఎస్ఆర్టీసీ అయినా, అటు టీఎస్ఆర్టీసీ అయినా నష్టాలను తప్ప లాభాలను ఏనాడూ చూసింది లేదు. కానీ, ఏపీఎస్ఆర్టీసీ తొలి సారి లాభాలను నమోదు చేసింది. నిన్నటి వరకు ప్రతి రోజూ కోటిన్నర నష్టాలను మూటగట్టుకుంటున్న ఆర్టీసీ... మే నెలలో బాగా పుంజుకుంది. ఇప్పటి వరకు రూ. కోటిన్నరకు పైగా లాభాలను గడించింది. ప్రతి రోజు రూ. 12.25 కోట్లు దాటని కలెక్షన్లు ఇప్పుడు ఏకంగా రూ. 14.50 కోట్లకు ఎగబాకాయి. పెళ్లిళ్లు, వేసవి సెలవులు తదితర అంశాలు కూడా ఆర్టీసీకి బాగా కలసివచ్చాయి. మరోవైపు, బస్సులను నడపడంలో లోపాలను సరిదిద్దుకోవడం, కొత్త బస్సుల కొనుగోళ్లు, ఆక్యుపెన్సీని పెంచుకోవడం తదితర అంశాలలో యాజమాన్యం చేసిన కృషి ఫలించి, చివరకు ఆర్టీసీని లాభాల బాట పట్టించింది.

దీనికి తోడు ప్రజా రవాణా వ్యవస్థ నడ్డి విరుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది. దీని దెబ్బకు కేశినేని ట్రావెల్స్ వంటి బడా సంస్థ కూడా మూతబడింది. ఈ క్రమంలో కొన్ని ఇతర ట్రావెల్స్ సంస్థలు కూడా తమ సర్వీసులను ఆపేశాయి. దీంతో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులలో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. ఇలా అన్నీ కలసివచ్చి ఆర్టీసీని లాభాల బాట పట్టించాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పందిస్తూ, రానున్న రోజుల్లో లాభాలు మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

  • Loading...

More Telugu News