: బస్సు ఖాళీగా ఉన్నా డ్రైవర్ ఎక్కనీయడు... తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం తెస్తున్న 'వజ్ర'


ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మినీ ఏసీ 'వజ్ర' బస్సు అది. ప్రయాణికులు అధికంగా ఉండే ప్రాంతానికి వెళ్లి, అక్కడే వారిని ఎక్కించుకుని, గమ్యస్థానాలకు చేర్చే ఉద్దేశంతో వీటిని ప్రారంభించారు. అయితే, ఈ బస్సులు కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ రేషియో కూడా లేకుండా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - నిజామాబాద్ మార్గాల్లో ఈ బస్సులు నడుస్తుండగా, మార్గమధ్యంలో ప్రయాణికులు ఎందరున్నా బస్సెక్కే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం. డ్రైవర్ వద్ద టికెట్ల జారీ సదుపాయం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ బస్సులు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణికులతోనే నడుస్తున్నాయి. బస్టాపుల్లో ప్రజలు బస్సుల కోసం ఎదురుచూస్తున్నా వీటిని ఎక్కలేని పరిస్థితి. అధికారుల అవగాహనా లేమి కారణంగానే ఇలా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ బస్సు ఎక్కాలంటే, యాప్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ఇవి ఇమ్లీబన్ లేదా జూబ్లీ బస్టాండ్ మీదగా కాకుండా, వాటికి నిర్దేశించిన కాలనీల గుండా ప్రయాణిస్తాయి. ఈ సదుపాయం ప్రయాణికులకు వరమే. కానీ, టికెట్ కొని ఎక్కే విధానం లోపభూయిష్టంగా ఉంది. బస్సులో లేదా ఆర్టీసీ కౌంటర్లలో వీటికి టికెట్లు లభించవు. కేవలం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆ వివరాలు డ్రైవర్ వద్ద ఉన్న ట్యాబ్ లో కనిపిస్తూ ఉంటాయి. దీంతో బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఉన్న కాలనీకి వెళ్లి అతడిని బస్సు ఎక్కించుకుని ముందుకు సాగుతుంటారు. డ్రైవర్ ఫోన్ నంబర్ తదితర వివరాలు ప్రయాణికుడి మొబైల్ కు వస్తాయి. మార్గమధ్యంలో బస్సులో ఖాళీ ఉన్నా, ప్రయాణికులను అనుమతించేందుకు వీల్లేకపోవడంతో ఈ బస్సులు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. ఇక 'వజ్ర' బస్సులపై ప్రజల్లో మరింత అవగాహన తేవాలని, డ్రైవర్ వద్ద టిమ్ మిషన్లు ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News