: రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి: హీరో మాధవన్, చేరన్


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ నటుడు మాధవన్, దర్శక, నటుడు చేరన్ కూడా చేరారు. ఈ నేపథ్యంలో మాధవన్‌ మీడియాతో మాట్లాడుతూ, ఏది మంచిదో రజనీకాంత్‌ కు బాగా తెలుసు. అలాగే ఏం చేయాలో కూడా ఆయనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచిదేనని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానని మాధవన్ స్పష్టం చేశారు.

అనంతరం చేరన్‌ మాట్లాడుతూ, రజనీకాంత్‌ ను ఆయన అభిమానులు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ప్రజల్లో నిజాయతీ కొరవడినందున ఆయన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో రజనీకాంత్ తనకు దోపిడీ, అవినీతి, స్వార్థం కలగలిసిన ఈ రాజకీయ వ్యవస్థకు సూటౌతానా? లేదా? అన్నది సరి చూసుకోవాలని సూచించారు.

అంతే కాకుండా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయన ముందుగా కర్ణాటకను వ్యతిరేకించాలని, హిందీకి మద్దతివ్వకూడదని, ఉచిత హామీలు కొనసాగించాలని, మద్యం దుకాణాలను మూసివేయకూడదని... వంటి చాలా సవాళ్లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వీటన్నింటిపై క్షేత్రస్థాయిలో కసరత్తు చేసిన తరువాతే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు.

కాగా, రజనీకాంత్ తన అభిమానులతో సమావేశమవుతూ, ‘తాను రాజకీయాల్లోకి రావలసిన పరిస్థితి వస్తే, తప్పకుండా వస్తా’నని ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడే ఆయన రాజకీయ రంగప్రవేశం అంటూ పలు వార్తా సంస్థలు కధనాలు కూడా ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News