: అమెరికా జైల్లో భారత శాస్త్రవేత్త అష్టకష్టాలు!
భారత అణు శాస్త్రవేత్త తరుణ్ కే భరద్వాజ్, ఓ తెల్లజాతి అమ్మాయిని ప్రేమించాడన్న అక్కసుతో, లైంగిక వేధింపుల కేసు పెట్టి గత సంవత్సరం నుంచి అమెరికాలోని టెక్సాస్ జైల్లో నిర్బంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం నుంచి తనను విధులకు హాజరు కానివ్వకుండా అడ్డుకున్నారని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని తరుణ్ వాపోతున్నారు. ఓ విశ్వవిద్యాలయంలో తాను ఒక అమ్మాయిని ఇష్టపడగా, దాన్ని సహించలేక జాతి వివక్షతో తనను అక్రమంగా డిటెన్షన్ సెంటర్లో ఉంచి తీవ్ర వేదనకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
వర్శిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే, దానిపై ఫిర్యాదు చేయడం తప్పయిపోయిందని అన్నారు. ఆ కేసును వెనక్కు తీసుకోవాలని తనపై ఒత్తిడి వచ్చిందని, తాను లొంగకపోయేసరికి, యువతిని వేధించానని కేసులు బనాయించారని వాపోయారు. కాగా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో పీహెచ్డీని పూర్తి చేసి, తన తదుపరి పరిశోధనల నిమిత్తం 2007లో తరుణ్ అమెరికాకు వెళ్లగా, ఆయన కుటుంబం ప్రస్తుతం బులంద్ షహర్ లో నివాసం వుంటోంది. అతను అమ్మాయిలను వేధించాడని, వర్శిటీ నిబంధనల ప్రకారం చేతికి ధరించాల్సిన జీపీఎస్ డివైస్ ను తీసివేశాడని అతనిపై ఆరోపణలు ఉండగా, ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది.