: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ.. జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మువైపే మొగ్గు!


రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులు ఎవరన్న విషయం ఇంకా ఓ కొలక్కి రాలేదు. జూలై 25తో ప్రణబ్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అధికార, విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. రాష్ట్రపతిగా ఎన్డీఎ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇస్తామని కొన్ని రాజకీయ పక్షాలు ఇప్పటికే చెప్పగా, తమిళనాడులోని అధికార అన్నాడీఎం కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ విషయాన్ని ఇటీవల బాహాటంగానే ప్రకటించారు. దీంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ ఒడిశాలోని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్మును వ్యూహాత్మకంగా బరిలోకి దింపాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం కలిసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తోంది. ఆదివాసీ వర్గానికి చెందినవారు ఇప్పటి వరకు రాష్ట్రపతిగా ఎన్నిక కాలేదు.

 ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా ఉపర్‌బెడ గ్రామానికి చెందిన ముర్ము తొలుత ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1997లో రాజకీయ రంగప్రవేశం చేశారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2000 - 2004 మధ్య కాలంలో శాసనసభ్యురాలిగా పనిచేశారు. బీజేపీ- బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు.  ప్రస్తుతం జార్ఖండ్‌కు తొలి మహిళా గవర్నర్‌గా సేవలందిస్తున్నారు.

  • Loading...

More Telugu News