: హమ్మయ్య.. అమ్మాయిల జనాభా పెరిగింది
ఇన్నాళ్లూ పురుషులతో పోల్చుకుంటే తగ్గుతూ వస్తున్న అమ్మాయిల జనాభా రాష్ట్రంలో మళ్లీ పెరిగి కొత్త ఊపిరినిచ్చింది. అమ్మాయిలంటే ఉన్న చిన్న చూపు వారిని గర్భంలోనే చిదిమేసే పరిస్థితులు గతంలో పెద్ద ఎత్తున సాగడంతో జనాభా తగ్గుముఖం పట్టింది. గతంలో స్త్రీల సంఖ్య ప్రతీ 1000 మంది పురుషులకు 945 మందికి తగ్గుముఖం పట్టడంతో ఆందోళన మొదలైంది. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడంతో తాజా జనాభా లెక్కల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ప్రతీ 1000 మంది పురుషులకు 993 మంది స్త్రీలు ఉన్నారు.
అమ్మాయిల పట్ల నేడు సమాజ ధోరణిలో మార్పు వచ్చింది. అబ్బాయిల కంటే వారే చదువులలో ముందంజలో ఉంటున్నారు. దీనికి తోడు లింగ నిర్దారణ పరీక్షలపై ఆంక్షలతో భవిష్యత్తులో అమ్మాయిల సంఖ్య పెరిగి అబ్బాయిల కరవు రానున్నట్లు తెలుస్తోంది. ఇక మహిళలు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఇక్కడ 1040 మంది మహిళలు ఉండడం విశేషం. హైదరాబాద్ లో తక్కువగా ఉన్నారు. ఇక ప్రతీ 1000 మందికి 954 మంది స్త్రీలే ఉన్నారు.