: దిండుగల్ శ్రీనివాసన్, డి.జయకుమార్ లను పార్టీ నుంచి తొలగిస్తేనే చర్చలు: ఓపీఎస్ మరోసారి ఆఫర్
తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలు సస్పెన్స్ ధ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాల కలయిక ఒక అడుగు ముందుకి, నాలుగడుగులు వెనక్కిలా సాగుతోంది. తాజాగా మరోసారి ఈ వర్గాల కలయిక తెరపైకి రాగా... దీనిపై ఓపీఎస్ వర్గం నేత ఇ.మధుసూదనన్ స్పష్టమైన ప్రకటన చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబంతోపాటు మంత్రులుగా ఉన్న దిండుగల్ శ్రీనివాసన్, డి.జయకుమార్ లను కూడా పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తేనే చర్చల గురించి మాట్లాడాలని, లేని పక్షంలో చర్చల సంగతే మర్చిపోవాలని స్పష్టం చేశారు. పళనివర్గం కుయుక్తులతో డ్రామాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. చర్చలంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం, తమ డిమాండ్లను పక్కనపెట్టడం జరుగుతోందని, జయలలిత సైద్ధాంతిక వారసత్వాన్ని కొనసాగించడంలో తాము రాజీ పడబోమని వారు తేల్చిచెప్పారు.