: బ్రిటన్ దౌత్యవేత్తకు చుక్కలు చూపించిన అడవి పందులు!
తన వెంట అడవిపందులు పడ్డాయని, మొదట తనకు అది సరదాగా అనిపించిందని, అయితే, అందులో ఒకటి తన వైపునకు పరిగెత్తుకుంటూ రావడంతో తాను కూడా పరుగులు పెట్టానని ఆస్ట్రియాలోని బ్రిటన్ దౌత్యవేత్త టర్నర్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం... ఇటీవల ఆయన వియన్నాలోని ఒక పార్కులో నడుస్తున్నారు. అక్కడ కొన్ని అడవి పందులు ఆయన వెనకాలే ఫాలో అవుతూ వచ్చాయి. అయితే, ఒక అరగంట దాటాక అడవి పందుల సంఖ్య పెరిగిపోయింది. చెట్లలోంచి ఒక్క ఉదుటున వచ్చేసిన అడవి పందులు అప్పటికే ఆయన వెంట పడుతున్న అడవి పందులతో కలిసిపోయి భారీ గుంపుగా ఏర్పడ్డాయి.
ఆయన వెనుదిరిగి చూడగానే ఓ భారీ అడవిపంది అతని వైపు వేగంగా వచ్చేసింది. దీంతో భయంతో పరుగునందుకున్నారు టర్నర్. అనంతరం అక్కడి ఓ చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడిపోయారు. చివరికి తన వెంటపడిన అడవిపంది ఆ గుంపులో కలిసి వెళ్లిపోవడంతో గండం గడిచిందని అనుకున్నారు. ఇంటికి వెళ్లాక ఈ విషయాన్ని తన బ్లాగ్ ద్వారా తెలిపారు.