: మెట్రో రైల్లో మహిళను వీడియో తీసిన ప్రయాణికుడు... అదే రీతిలో బుద్ధి చెప్పిన మహిళ!
స్మార్ట్‌ఫోన్‌లో ఉండే కెమెరా సాయంతో యూజర్లు తమకు నచ్చిన ప్రదేశాలను, ఆసక్తికర ఘటనలను వీడియో తీసుకొని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి సంతోషపడుతుంటారు. అయితే, అనుమతి లేకుండా ఇతరుల వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు తీయడం మాత్రం నేరం. కానీ అటువంటి తప్పుడు పనే చేశాడు ఓ సింగపూర్ వ్యక్తి. స్టైలుగా మెట్రో రైలులోకి వచ్చి, బుద్ధిమంతుడిలా ఓ అమ్మాయి ముందు కూర్చొని తన సెల్‌ఫోన్ సాయంతో ఆమెను వీడియో తీశాడు. స్మార్ట్‌ఫోన్‌లో ఏదో చూసుకుంటున్నట్లుగా నటిస్తూ దానికి ఉండే కెమెరాతో వీడియో తీస్తూ ఎవ్వరూ గమనించట్లేదని సంబరపడిపోయాడు. అయితే, సీన్ రివర్స్ అయింది. సీరియస్‌గా అతడు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ చాలాసేపు అలాగే ఉండడంతో.. ఆమె కాస్త జాగ్రత్తగా పరిశీలించింది.
అతడి వెనకాల ఉన్న కిటికీ అద్దం మీద ఆ ఫోన్‌లో ఏం చేస్తున్నదీ ఆమెకు స్పష్టంగా కనిపించింది. కానీ, అతడిని ఆమె అప్పుడే ఏమీ అనలేదు. తనకు ఏమీ తెలియనట్లుగా తాను కూడా ఫోన్ తీసి అతడిని వీడియో తీయడం మొదలుపెట్టింది. స్మార్ట్‌ఫోన్ కెమెరాను అతడి వెనకాల ఉన్న కిటికీ అద్దం మీదకు పెట్టడంతో.. అతడు ఆమెను జూమ్ చేసి బాగా క్లోజప్‌లో తనను షూట్ చేయసాగిన ఘటన ఆమె స్మార్ట్‌ఫోనులో రికార్డయింది. ఆపై అతడిని నిలదీసిన ఆ మహిళ అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు పట్టించింది.
ఆమె తన ఇంటికి వెళ్లాక తాను తీసిన వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఆ వీడియోను కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మంది చూశారు. ఆ మహిళ పేరు ఉమా మహేశ్వరి. గుర్తుతెలియని మహిళలను అత్యంత అసభ్యకరమైన రీతిలో అతడు వీడియో తీస్తాడని, పోలీసులు అతడి ఫోనును పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఆమె తన పోస్టులో చెప్పారు. తాను ఆ వ్యక్తితో గొడవ పెట్టుకున్నప్పుడు అతడు తనను చెల్లి లాంటిదానివని, వదిలేయమని కోరాడని తెలిపింది.