: యూపీలో పెళ్లి వేదికపై 'రివాల్వర్' రాణి... తలకు గురిపెట్టి వరుడి అపహరణ!


కాసేపట్లో వివాహం జరుగుతుందన్న ఆనందంలో అంతా కోలాహలంగా ఉన్న ఓ కల్యాణ మండపానికి ఓ స్కార్పియో వాహనం దూసుకొచ్చింది. ఓ రివాల్వర్ పట్టుకుని దిగిన 25 ఏళ్ల యువతి డైరెక్టుగా మండపం పైకి ఎక్కి, వరుడి తలకు గురిపెట్టి, అతన్ని తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. సదరు యువతి వరుడి తలకు రివాల్వర్ ను గురిపెట్టిన తరువాత "ఈ మనిషి నన్ను ప్రేమించాడు. కానీ ఇప్పుడు మోసం చేసి మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నేను దీన్ని జరగనివ్వబోను" అంటూ చెప్పి వరుడిని తీసుకెళ్లిపోయింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా వాహనంలో వచ్చారని బంధువులు తెలిపారు.

ఇక స్థానికుల కథనం ప్రకారం, కొన్ని నెలల క్రితం తాము పని చేస్తున్న చోట వీరిద్దరూ ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, ఆపై తల్లిదండ్రుల ఒత్తిడితో వారు చూసిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ఆ యువకుడు సిద్ధపడ్డాడని అంటుండటం గమనార్హం. కాగా, తన కుమారుడు పని చేస్తున్న ప్రాంతానికి ఇటీవల వెళ్లిన తనను ఇంటికి పిలవలేదని, ఓ గుడిలో కలసి, హోటల్ లో భోజనం పెట్టించి వెనక్కు పంపాడని, అప్పుడే తనకు అనుమానాలు వచ్చాయని వరుడి తండ్రి రామ్హేత్ యాదవ్ వెల్లడించారు. తన కుమారుడు కిడ్నాప్ నకు గురయ్యాడన్న ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపిస్తామని తెలిపారు. మోసం చేసే అబ్బాయిలు ఉన్నంత కాలం వారికి బుద్ధి చెప్పేందుకు ఇటువంటి 'రివాల్వర్ రాణులు' వస్తుంటారని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించడం విశేషం.

  • Loading...

More Telugu News