: అమెరికా అయిపోయింది... ఇప్పుడు దక్షిణ కొరియా రంగంలోకి దిగింది...కిమ్ జాంగ్ ఉన్ ఓకే అంటాడా?
చైనాను ప్రయోగించి ఉత్తరకొరియాను దారికి తెచ్చుకుందామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, అణుపరీక్షలు ఆపితే చర్చలకు సిద్ధం అంటూ ఆయన ప్రకటించారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేసిన నేపథ్యంలో ఉత్తర కొరియా అణుపరీక్ష నిర్వహించి వారికి షాక్ ఇచ్చింది. దీంతో తమ మాటకు ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ విలువ ఇవ్వడని భావించి, నేరుగా దక్షిణ కొరియాను రంగంలోకి దించారు. చర్చలను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దక్షిణకొరియా తాజాగా ప్రకటన విడుదల చేసింది.
అయితే అందుకు అణు సామర్ధ్యం కలిగిన క్షిపణి పరీక్షలను మానుకోవాలని షరతు విధించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఉత్తరకొరియాతో టూ-ట్రాక్ పాలసీని అవలంబించాలని భావిస్తున్నట్లు ఈ ప్రకటనలో దక్షిణ కొరియా తెలిపింది. అయితే మిత్ర దేశమైన చైనా చేసిన విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోని ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ శత్రుదేశమైన దక్షిణ కొరియా చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటాడా? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.