: జీవితంలో సంతృప్తే లేదు: ఏపీ ప్రభుత్వ సర్వేలో ప్రజల అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ లో పాలనను మరింత పారదర్శకం చేయాలన్న ఆలోచనతో నిర్దిష్ట అంశాలపై చంద్రబాబు సర్కారు ప్రత్యేక సర్వే నిర్వహించగా, ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తమ జీవితంలో సంతోషం తగ్గిపోయిందని అత్యధికులు సమాధానం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా సంతోషం స్థాయిలో ప్రకాశం జిల్లా అట్టడుగున ఉంది. ఆరు అంశాలపై ఈ సర్వేను అన్ని జిల్లాల్లో నిర్వహించగా, ప్రతి ప్రశ్నకు 0 నుంచి 10 పాయింట్లు వేయాలని సర్వేలో పాల్గొన్న ప్రజలను కోరారు.
ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో (6.41పాయింట్లు) నిలువగా, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రకాశంలో సంతోష స్థాయి కేవలం 4.697 పాయింట్లు మాత్రమే. జీవిత కాలపు అంచనా, సామాజిక మద్దతు, ఇష్ట ప్రకారం జీవించే హక్కు, ప్రభుత్వంలో అవినీతి తదితరాలపై ప్రశ్నిస్తూ, మొత్తం 17,800 మందిని ప్రశ్నించి, మొత్తం 16,159 మంది అభిప్రాయాలను క్రోడీకరించి నివేదికను రూపొందించారు.