: సినీ దర్శకుడు విజయ్ రెడ్డి కిడ్నాప్... విడుదల


హైదరాబాదులో సినీ దర్శకుడి కిడ్నాప్ పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, నిందితులతో మాట్లాడి విడిపించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఇందిరానగర్‌ లో నివాసముండే సినీ దర్శకుడు విజయ్‌ రెడ్డి గత అక్టోబరులో అల్మాస్‌ గూడకు చెందిన నరేశ్‌ అనే వ్యక్తి వద్ద వోక్స్‌ వ్యాగన్‌ కారును 5.50 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. 50 వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన విజయ్ రెడ్డి, మిగిలిన 5 లక్షల రూపాయలు 15 రోజుల్లో ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటానని నమ్మించాడు. ఆ తరువాత కారుకు సంబంధించిన నాలుగు ఈఎంఐ వాయిదాలు కట్టాడు. బకాయి చెల్లించలేదు, ఈఎంఐలు కట్టడం లేదు.

దీంతో బ్యాంకు అధికారులు పలు మార్లు నరేష్ ను హెచ్చరించారు. దీంతో విజయ్ రెడ్డిని డబ్బుల విషయమై నరేశ్ నిలదీశాడు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, తన ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చిన నరేష్... ఇందిరానగర్‌ లో ఉన్న విజయ్‌ రెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకుని అల్మాస్‌ గూడకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో డబ్బుల కోసం అతనిని బెదిరించి, దాడి చేశారు. ఇంతలో అతని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మహేందర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులతో మాట్లాడి, విజయ్ రెడ్డిని తీసుకొచ్చేలా చేశారు. 

  • Loading...

More Telugu News