: జైల్లో ఉండి ఇంటర్ చదివి పాసైన హర్యానా మాజీ సీఎం
2000 సంవత్సరంలో హర్యానాలో 3,206 మంది టీచర్ల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దోషిగా తేలి, ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా, 82 ఏళ్ల వయసులో ఇంటర్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తీహార్ జైలులోని కేంద్రంలో చదువుకున్న ఆయన, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) నిర్వహించిన పరీక్షలు రాసి పాస్ అయ్యారు.
తన తండ్రి ఇంటర్ పాస్ కావడంపై ఆయన కుమారుడు, విపక్ష నేత అభయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో పెరోల్ పై ఉన్న ఆయన, జైల్లోని కేంద్రానికే వెళ్లి చదువుకున్నారని, పెరోల్ ముగిసిన తరువాత ఆయన తిరిగి జైలుకు వెళ్లారని తెలిపారు. ఇక డిగ్రీని కూడా చదువుతానని చౌతాలా చెబుతుండటం విశేషం. కాగా, టీచర్ల నియామకం కేసులో ఆయనకు పది సంవత్సరాల కారాగార శిక్ష పడగా, 2015 నుంచి ఆయన జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.