: ముస్లిం సమాజంలో వివాహం కేవలం ఓ కాంట్రాక్టు వంటిదే... మహిళలు కూడా 'తలాక్' చెప్పొచ్చు: సుప్రీంకోర్టులో లా బోర్డు
ముస్లిం సమాజంలో వివాహం అనేది ఓ కాంట్రాక్టు మాత్రమేనని, మహిళలు కూడా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు విడాకులు ఇవ్వవచ్చని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేసును విచారిస్తుండగా, లా బోర్డు తరఫున ఇజాజ్ మక్బూల్ వాదనలు వినిపించారు.
వివాహ బంధంలోకి ప్రవేశించే ముందు మహిళలకు నాలుగు అవకాశాలు ఉంటాయని, వారు తమ పెళ్లిని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తేవచ్చని తెలిపారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం, మూడుసార్లు తలాక్ చెప్పి ఆ బంధాన్ని వదిలించుకోవచ్చని తెలిపారు. కాగా, గత సంవత్సరం సెప్టెంబరులో సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ ను సమర్పిస్తూ, షరియా చట్టాలు కేవలం భర్తలకు మాత్రమే విడాకులు ఇచ్చే హక్కును ఇచ్చిందని, వారు మాత్రమే నిర్ణయాధికారాన్ని కలిగివుంటారని వ్యాఖ్యానించడం గమనార్హం.