: ముంబైకి మూడో కప్పు లేనట్టే... ఐపీఎల్ చరిత్ర చెబుతున్నదిదే!
14 మ్యాచ్ లలో 20 పాయింట్లతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ నిన్న జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో రైజింగ్ పుణె జయింట్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గ్రూప్ లో టాప్ లో నిలిచిన రెండు జట్లకూ ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. నేడు కోల్ కతా, హైదరాబాద్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో ముంబై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే, ఐపీఎల్ లో గత విజేతలను పరిశీలించిన వారంతా ఈ సంవత్సరం ముంబైకి ట్రోఫీ అందే అవకాశాలపై పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే, గత ఆరు సీజన్లలో గ్రూప్ దశలో టాప్ లో ఉన్న ఏ జట్టు కూడా ట్రోఫీని అందుకోలేదు కాబట్టి.
ఐపీఎల్ విజేతలను పరిశీలిస్తే, 2011లో జరిగిన ఫైనల్ లో బెంగళూరు (1), చెన్నై (2) జట్లు తలపడగా చెన్నై గెలిచింది. 2012లో కోల్ కతా (2), చెన్నై (4) జట్లు తలపడగా కోల్ కతా ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో చెన్నై (1), ముంబై (2) ఫైనల్ కు చేరగా ముంబై తొలిసారిగా ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇక 2014 విషయానికి వస్తే పంజాబ్ (1), కోల్ కతా (2) ఫైనల్ లో ఆడగా, కోల్ కతా గెలిచింది. 2015లో చెన్నై (1), ముంబై (2) ఆడగా, ముంబై గెలిచింది. 2016లో బెంగళూరు (2), హైదరాబాద్ (3) ఫైనల్ ఆడగా, హైదరాబాద్ గెలిచింది. ఈ పోటీల్లో టాప్ లో నిలిచిన జట్టు ఏ సంవత్సరం కూడా ట్రోఫీని అందుకోలేదు. దీన్నే ఉదాహరణగా చూపుతున్న విశ్లేషకులు, ముంబై గెలిస్తే చరిత్ర మారినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు.