: శివశ్రీ తండ్రి ఎంత కఠినాత్ముడో..!: కుమార్తె చనిపోవడానికి రెండు రోజుల ముందు కోర్టు నోటీసులు!


నన్ను కాపాడండి నాన్నా.. అని అభ్యర్థించినా తండ్రి మనసు కరగకపోవడంతో తనువు చాలించిన విజయవాడకు చెందిన చిన్నారి శివశ్రీ కథ తెలిసి అప్రయత్నంగానే అందిరి కళ్ల వెంట నీళ్లు ఉబికి వచ్చాయి. తాజాగా శివశ్రీ తండ్రి శివకుమార్ ఎంతటి కఠినాత్ముడో తెలిపే విషయం మరొకటి బయటపడింది. కుమార్తె మరణానికి సరిగ్గా రెండు రోజుల ముందు శివశ్రీ తల్లి సుమశ్రీకి లీగల్ నోటీసు పంపాడు. పాపతో కలిసి వెంటనే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అందులో ఎవరూ ఉండడానికి వీల్లేదని నోటీసులో పేర్కొన్నాడు. తాజాగా మంగళవారం సుమశ్రీతోపాటు ఆమె సోదరులు, తోబుట్టువులు, స్నేహితులకు కూడా కేవియట్‌లు అందాయి. ‘‘నా ఇంట్లో ఉంటున్న మీరు ఖాళీ చేయమన్నా చేయడం లేదు. కోర్టుకు రండి..’ అని కేవియట్‌లో పేర్కొన్నాడు.

కాగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మంగళవారం సుమశ్రీని పరామర్శించారు. శివకుమార్ నిర్లక్ష్యం వల్ల తన కుమార్తె చనిపోయిందని, అతడికి శిక్ష పడేలా చూడాలని సుమశ్రీ ఈ సందర్భంగా కోరారు. ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని నన్నపనేని ఆమెకు హామీ ఇచ్చారు.

విజయవాడలోని దుర్గాపురానికి చెందిన మాదంశెట్టి వెంకట సాయి కృష్ణ శివశ్రీ  కేన్సర్‌తో బాధపడింది. పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. వైద్యానికి అయ్యే ఖర్చు కోసం తాము ఉంటున్న ఇంటిని అమ్ముకునేందుకు అనుమతించాలన్న సుమశ్రీ అభ్యర్థనను శివకుమార్ తిరస్కరించడమే కాక ఇంటిని ఖాళీ చేయాలని బెదిరింపులకు కూడా దిగినట్టు ఆరోపణలున్నాయి.

  • Loading...

More Telugu News