: తెలుగు రాష్ట్రాలకు కూలింగ్ న్యూస్.. వచ్చేస్తున్న రుతుపవనాలు!
ప్రచండ భానుడి ఉగ్రరూపానికి ప్రజల మాడు పగిలిపోతున్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే కేరళ తీరాన్ని తాకనున్నట్టు తెలిపింది. మే 30న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొనగా, అంతకంటే ఒక రోజు ముందే వస్తాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ పేర్కొంది.
మామూలుగా ప్రతి ఏడాది జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. గత కొన్ని రోజులుగా కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఈనెల 25 నాటికి ఇది మరింత పుంజుకుంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
విదర్భ, తెలంగాణ వంటి మధ్య ప్రాంతాల్లో భూమి బాగా వేడెక్కడం వలన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశాలున్నాయని, ఇది రుతుపవనాల రాకకు తోడ్పడే అవకాశం ఉందని స్కైమెట్ భావిస్తోంది. ఈ నెల చివరిలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయానికే కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక జూన్లో సగటు వర్షపాతానికి ఒకటి రెండు శాతం ఎక్కువే వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.