: ‘హీరో’ రెడీ.. జూన్ 2న శ్రీసిటీలో ప్లాంట్‌కు శంకుస్థాపన
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ఆంధ్రప్రదేశ్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. పలు బాలారిష్టాలను దాటుకున్న సంస్థ చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్‌కు జూన్ 2న శంకుస్థాపన చేయనుంది. ‘హీరో’కు ప్రభుత్వం తొలుత కేటాయించిన భూమి వివాదాల్లో ఉండడంతో తమకు వేరే చోట భూమి ఇవ్వాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పరిశ్రమల శాఖ వివాదాల్లేని మరో చోట భూమిని కేటాయించింది. ప్రస్తుతం ఆ భూమిలో శంకుస్థాపన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు సమాచారం.