: పెళ్లి సంబంధం చెడగొట్టాడు.. తనను కాదంటే యాసిడ్ పోసి చంపేస్తానంటూ యువతిని బెదిరిస్తున్నాడు!
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.. తాను ఇష్టపడుతున్న ఆ అమ్మాయి తనను తప్పా వేరెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదని బెదిరిస్తున్నాడు.. తన మాట వినకపోతే అంతే సంగతులు అని బెదిరిస్తున్నాడు. యాసిడ్ పోసి చంపేస్తానని అంటున్నాడు. తనను ఇన్నాళ్లు బెదిరిస్తోన్న ఓ యువకుడి గురించి ఆ యువతి ఎట్టకేలకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆ యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... నగరంలోని ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌లో నివసించే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి ఓ యువకుడి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. తనను వేధిస్తోన్న ఆ యువకుడు బీదర్‌కు చెందిన సందీప్(25) అని ఆ యువతి చెప్పింది.
పెళ్లంటూ చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలని సందీప్ ఆ యువతిలో అంటున్నాడు. అయితే, ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతూ కనపడే తనని చేసుకోనని ఆ యువకుడితో ఆ విద్యార్థిని చెప్పింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న సందీప్... బెదిరింపులకు పాల్పడడమే కాకుండా.. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు చేస్తున్నాడు. అంతేకాదు.. మూడు రోజుల క్రితం బీదర్‌కు చెందిన ఓ యువకుడితో ఆ యువతికి పెళ్లి నిశ్చయం కాగా సందీప్ ఆ సంబంధాన్ని చెడగొట్టాడు. తనకు ఆ యువతికి ఎంతో క్లోజ్ అంటూ అసత్యాలు పలికి వివాహం రద్దయ్యేలా చేశాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.