: డాన్సు చేయమంటే చేయలేదని.. భార్యను మేడ పైనుంచి తోసేసిన భర్త!
ఓ వ్యక్తి తన భార్యను మేడపై నుంచి కిందకు తోసేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా చిల్లాఘాట్ పట్టణ సమీపంలోని డిఘ్వాట్ గ్రామంలో చోటుచేసుకుంది. అనంతరం ఆ భర్త గ్రామం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. ఆ గ్రామంలో జరుగుతున్న తన బంధువుల పెళ్లికి విశాఖ తివారీ(28) అనే మహిళ తన భర్తతో కలిసి వెళ్లింది. ఈ పెళ్లి వేడుకలో 'కలేవా' అనే తంతు జరుగుతోంది. ఈ వేడుకలో అంతా డ్యాన్స్ చేస్తున్నారు. విశాఖ భర్త అజయ్ ఇతర అతిథులతోను కలిసి డాన్సు చేస్తున్నాడు.
తన భార్య విశాఖ కూడా డ్యాన్స్ చేయాలని ఆమెను కోరాడు. అయితే, ఆమె డ్యాన్స్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఆమెను మేడ మీద నుంచి కిందరు తోసేశాడు. ఆ సమయంలో ఆ భర్త మద్యంతాగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. దీంతో విశాఖకు రెండు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాక, ఆమె తలకు, ఉదరభాగంలోను కూడా గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.