: నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలపై భానుడు విరుచుకుపడుతున్నాడు. ఇరు రాష్ట్రాల్లో సుమారు 4 నుంచి 6 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలకు చేరాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇరు రాష్ట్రాల్లో వడగాల్పులు తీవ్రమయ్యాయి. వడగాలుల ప్రభావంతో పలుచోట్ల రాత్రి వేళల్లోనూ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు గుంటూరులో 47, విజయవాడలో 45 డిగ్రీలు, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రిలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.