: స్నేహితుడి కోసం సమాధిని తవ్విన ఉసేన్ బోల్ట్!
అంతర్జాతీయ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ స్నేహానికిచ్చే విలువ ఎటువంటిదో ఈ సంఘటన మనకు తెలియజెబుతుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఒలింపిక్ పతక విజేత జర్మైన్ మాసన్ ఏప్రిల్ 20న అమెరికాలోని కరీబియన్ దీవుల్లోని ఈస్ట్ కింగ్ స్టన్ లోని నార్మన్ మాన్లే హైవేపై ద్విచక్రవాహనంపై వెళ్తూ ఉదయం 4.20 నిమిషాలకు రోడ్డు ప్రమాదం బారినపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాసన్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జమైకా చిరుత ఉసేన్ బోల్ట్, మిచెల్ ఫ్రాటర్ సహా పలువురు క్రీడాకారులు మాసన్ భౌతికకాయం వద్దకు చేరుకుని, నివాళులర్పించారు.
ఏప్రిల్ 23న పోర్ట్ లాండ్ లోని గ్రాంజ్ హిల్ లో నిర్వహించిన అంత్యక్రియల్లో మాసన్ ను పూడ్చి పెట్టేందుకు సహచర ఆటగాళ్లతో కలిసి బోల్ట్ గొయ్యితవ్వాడు. అనంతరం బోల్ట్ మాట్లాడుతూ, ‘2002 నుంచి మాసన్ నాకు స్నేహితుడు. అతని తల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా నిలుస్తాను. ఈ సమయం నాకు ఎంతో కఠినమైనది. తోటి ఆటగాడు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను’ అన్నాడు. జమైకాలో పుట్టిన మాసన్ హై జంప్ లో గ్రేట్ బ్రిటన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో మాసన్ బృందం వెండి పతకాన్ని గెలుచుకుంది.