: వారిలో మార్పు రాదు, జగన్ రానీయడు: చంద్రబాబు


ప్రతిపక్ష సభ్యుల వైఖరిలో మార్పు వస్తుందని తాను అనుకోవడం లేదని, ఒకవేళ ఎవరైనా మారదామని అనుకున్నా వారిని జగన్ మారనివ్వబోడని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తెలుగుదేశం ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్షం ప్రవర్తన విచిత్రంగా ఉందని అన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదంలో చర్చ జరగకుండా జగన్ అడ్డుకున్నారని ఆరోపించారు. ఏ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలో కూడా తెలియని అయోమయ స్థితిలో వైసీపీ పడిపోయిందని, మిర్చి రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపారు.

యూపీ, తెలంగాణ, ఏపీల్లో మాత్రమే రుణమాఫీ జరిగిందని, రాష్ట్రంలో రైతుకు రూ. 1.5 లక్షల వరకూ మాఫీ చేశామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఆర్థిక సంస్కరణలతోనే దేశం ముందడుగు వేస్తుందని అభిప్రాయపడ్డ ఆయన, జీఎస్టీ బిల్లును మరో అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు. ఈ బిల్లుతో దేశంలో పన్ను సంస్కరణలు వస్తాయని, అవి దేశాభివృద్ధికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే విద్యుత్ కోతలు లేకుండా చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News