: అమె నన్ను తదేకంగా చూసింది...ఫిర్యాదు చేస్తాను: అనుష్క శర్మపై షారూఖ్ ఖాన్ సరదా ట్వీట్
సహనటి అనుష్క శర్మపై ఫిర్యాదు చేస్తానని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అన్నాడు. రబ్ నే బనాదీ జోడీ, జబ్ తక్ హై జాన్, యేదిల్ హై ముష్కిల్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. తాజాగా వీరు ‘ది రింగ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం అనుష్క యశ్ రాజ్ ఫిల్మ్ స్టూడియోకు వెళ్లింది. తరువాత కాసేపటికి షారూఖ్ వచ్చాడు. దీంతో తన గదిలో ఉన్న అనుష్క...షారూఖ్ వ్యానిటీ వ్యాన్ రావడం చూసి, దానిని చూపిస్తూ సెల్ఫీ దిగి తన ఇన్ స్టా గ్రామ్ లో 'షారూఖ్ ఇప్పుడే వచ్చాడు... అదిగో వ్యానిటీ వ్యాన్' అంటూ దానిని పోస్టు చేసింది.
దీనిని చూసిన షారూఖ్... 'ఆమె నన్ను తదేకంగా చూసింది. దీనిపై ఫిర్యాదు చేస్తాను' అంటూ అనుష్క పోస్టును రీపోస్టు చేశాడు. ఈ సరదా ముచ్చట వారి అభిమానులను అలరిస్తోంది. యశ్ రాజ్ సంస్థ నిర్మించిన సినిమాలను షారూఖ్ కు మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ‘ది రింగ్’ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.