: ధర్నా చౌక్ నిరసనలో సివిల్ డ్రస్సులో మహిళా సీఐ ప్లకార్డులు... వేటు వేసిన అధికారులు
నిన్న హైదరాబాద్, ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నాచౌక్, నిరసనలతో దద్దరిల్లిన వేళ, ధర్నాచౌక్ వద్దంటూ నిరసనలు తెలుపుతూ ప్లకార్డులు పట్టుకున్న కొందరు మహిళా కానిస్టేబుళ్లు సాధారణ దుస్తులతో వచ్చి కూర్చోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీదేవి కూడా ప్లకార్డులు పట్టుకుని కనిపించడంతో ఆమెపై బదిలీ వేటు పడింది. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ, కంట్రోల్ రూమ్ కు అటాచ్ చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిడ్ వెల్లడించారు.
పోలీసులు ధర్నా చౌక్ వద్దని నిరసనలు తెలపడంతో, వారి వెనుక టీఆర్ఎస్ ఉందని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి వ్యవహారంపై విచారిస్తున్నామని, ఆమెపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, నిన్న ఉదయం ప్లకార్డులతో ధర్నా చేసిన మహిళా పోలీసులు, మీడియాలో వార్తలు రావడంతో వెళ్లిపోయి, ఆపై యూనిఫాంలో వచ్చి విధులు నిర్వహించడం గమనార్హం.