: ముంబైలో కనిపించిన తలలేని మొండెం వెనుక సంచలన నిజం... పెళ్లి చేసుకున్న ఐదు రొజులకే, స్వయంగా భర్తే..!
ముంబైలోని వర్లి ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన అదృశ్యమై, ఆపై తాను నివసించే ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో తలలేని మొండెం రూపంలో కనిపించిన ప్రియాంకా గౌరవ్ (24) కేసును పోలీసులు ఛేదించారు. ఆమె భుజంపై ఉన్న విఘ్నేశ్వరుడు, ఓం టాటూల సాయంతో ఆమె ఎవరన్న విషయాన్ని తేల్చిన పోలీసులు, ప్రియాంకను ఆమె భర్తే హత్య చేశాడని తేల్చారు. గత వారంలో ప్రియాంక శరీర భాగాలు ముంబై చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో కనిపించడంతో, తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే.
పోలీసులు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, బీకాం గ్రాడ్యుయేట్ అయిన ప్రియాంకకు, కనిపించకుండా పోవడానికి కేవలం ఐదు రోజుల ముందే వివాహం జరిగింది. తమకు కనిపించిన శరీర భాగాలు ప్రియాంకవేనని గుర్తించిన పోలీసులు, తొలుత ఆమె భర్తను ప్రశ్నించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనతో పాటు శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేసేందుకు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నరకబడిన తలను ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి పడవేసిన ప్రాంతానికి నిందితులను తీసుకెళ్లి పరిశీలించారు. కేసును విచారించి నిందితులకు శిక్షపడేలా చూస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.