: సంచలన విషయం... 'వాన్నా క్రై' సైబర్ దాడి చేయించింది ఉత్తర కొరియా!
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మాల్ వేర్ 'వాన్నా క్రై' దాడుల వెనుక ఉత్తర కొరియా హస్తముందని, అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కనుగొన్నామని సెక్యూరిటీ రీసెర్చర్లు సంచలన ప్రకటన చేశారు. ర్యాన్సమ్ వేర్ వైరస్ గా కంప్యూటర్లలోకి ప్రవేశించిన 'వాన్నా క్రై' 150 దేశాల్లోని ప్రముఖ వ్యాపార కేంద్రాలను, సంస్థలను తీవ్ర ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. లాజరస్ అనే హ్యాకర్ గ్రూప్ ఉత్తర కొరియా ప్రభుత్వంతో సంబంధాలను కలిగివుందని, వారి టూల్ కోడ్ ను హ్యాక్ అయిన కంప్యూటర్లలో కనుగొన్నామని ఫిడిలిస్ సైబర్ సెక్యూరిటీలో థ్రెడ్ రీసెర్చ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న జాన్ బాంమెనెక్ తెలిపారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఉత్తర కొరియా నిపుణులు 'వాన్నా క్రై' కోడ్ రాసుంటారని అలా జరగకపోయి ఉంటే, ఓ థర్డ్ పార్టీ కోడ్ ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడినట్టుగా భావించాలని అన్నారు.
కాగా, వైరస్ దాడులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయాన్ని శోధిస్తున్నామని వైట్ హౌస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సలహాదారు థామస్ బోసెర్ట్ వెల్లడించారు. ఈ వైరస్ పై పరిశోధనలు చేస్తున్న పలువురు రీసెర్చర్లు 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలో జరిగిన భారీ హ్యాకింగ్ కు దీనికి సంబంధాలున్నాయని, ఆనాడు వైరస్ ను సోనీ సంస్థలోకి పంపింది కూడా ఉత్తర కొరియానేనని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను హత్య చేసే పన్నాగం కథాంశంతో సోనీ ఓ సినిమాను తీయగా, దాని విడుదలకు కొన్ని రోజుల ముందు సైబర్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.