: ప్రభాస్ చేత ఎన్నికల ప్రచారం చేయించాలని చూస్తున్న జాతీయ పార్టీ!
బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా హీరో ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రభాస్ తో ఎన్నికల ప్రచారం చేయిస్తే, గెలుపు ఖాయమవుతుందన్న ధీమాలో ఉన్న ఆ పార్టీ, ప్రభాస్ సినిమాల షూటింగులకు ఇబ్బంది కలిగించకుండా ప్రచార షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ను ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా సదరు పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం.
అయితే, తన రాజకీయ ప్రచారంపై ప్రభాస్ ఇంతవరకూ నోరు విప్పలేదని తెలుస్తోంది. కాగా, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీలో చేరి 12,13 లోక్ సభలకు కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆపై 1999 నుంచి 2004 వరకూ వాజ్ పేయి మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ సేవలందించారు. అనంతరం 2009లో హీరో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవలి కాలంలో తిరిగి బీజేపీకి దగ్గరవుతున్నారన్న వార్తలూ వస్తున్నాయి. ఇక ప్రభాస్ ను ఆహ్వానిస్తున్న జాతీయ పార్టీ బీజేపీయా? లేక మరేదైనానా? అన్న విషయం అధికారికంగా తెలియాల్సి వుంది.