: తమిళనాడులో బీజేపీకి ఇంకా టైం రాలేదు.. కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. తమిళనాడులో వేళ్లూనుకునే సమయం బీజేపీకి ఇంకా రాలేదన్నారు. ఇంకా పలు విషయాలపై మాట్లాడుతూ ఇతరుల గురించి తనకు చింత లేదన్నారు. తనకు సంబంధించినంత వరకు జాతీయ జెండా కనిపిస్తే తలవంచి నమస్కరిస్తానని పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారంపై కమల్ మాట్లాడుతూ బీజేపీకి తమిళనాడు అనుకూలిస్తుందా? లేదా? అన్న విషయం తనకు తెలియదని, అయితే బీజేపీకి తమిళనాడులో ఇంకా టైం రాలేదని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకుడు ఒకరు తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు.. ఈ దేశంలో తమిళనాడు ఒక భాగం కాబట్టి రాష్ట్రాభివృద్ధిలో ఎవరైనా భాగం పంచుకోవచ్చని కమల్ తేల్చి చెప్పారు.