: కూతురు గ్రేసియా మొదటి పుట్టిన రోజున బాలింతల కోసం ట్రస్టు ప్రారంభించిన సురేష్ రైనా
టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్ సురేశ్ రైనా దంపతులు తమ కుమార్తె గ్రేసియా తొలి పుట్టిన రోజును పురస్కరించుకుని బాలింతల కోసం సేవా సంస్థను ప్రారంభించారు. గ్రేసియా రైనా ఫౌండేషన్ గా నామకరణం చేసిన ఈ సంస్థ.... పేద, అభాగ్య తల్లులకు సేవలందిస్తుంది. దేశవ్యాప్తంగా దయనీయ స్థితిలో ఉన్న ‘అమ్మ’లకు ఆసరాగా నిలిచి, వారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కృషి చేస్తుందని ప్రియాంక రైనా తెలిపింది. తల్లీబిడ్డల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కూడా తాము పాటుపడతామని ఈ సంస్థ బాధ్యతలు నిర్వర్తించే ప్రియాంక స్పష్టం చేసింది. రైనా ప్రకటన పట్ల క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. పలువురు క్రికెటర్లు రైనాను అభినందిస్తున్నారు.