: కర్ణన్ లాయర్‌కు సుప్రీం చీవాట్లు.. అంతరాయం కలిగిస్తే గెంటేస్తామని హెచ్చరిక
జస్టిస్ కర్ణన్ లాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం చీవాట్లు పెట్టింది. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగేలా ప్రవర్తిస్తే బయటకు గెంటేయక తప్పదని హెచ్చరించింది. కోర్టు ధిక్కారం కేసులో పడిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్న జస్టిస్ కర్ణన్ చేసుకున్న అప్పీలుపై న్యాయవాది నెడుంపరా అత్యున్నత ధర్మాసనంలో వాదనలు వినిపించారు. తన క్లయింటు చేసుకున్న అప్పీలు వ్యాజ్యాన్ని వెంటనే విచారించాలని కోరారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మాథ్యూస్‌కు చీవాట్లు పెట్టింది. మరోమారు కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించేలా వ్యవహరిస్తే బయటకు గెంటేయాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. తాము ఉదారంగానూ, కఠినంగానూ ఉండగలమని, మీ పట్ల అయితే ఉదారంగానే ఉన్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించినప్పటి నుంచి అరెస్ట్‌ను తప్పించుకు తిరుగుతున్న జస్టిస్ కర్ణన్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.