: మగవాళ్లూ! నిద్ర విషయంలో జాగ్రత్త.. లేకపోతే, వీర్యకణాలు నశిస్తాయట!
ఆరోగ్యానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రధానంగా, ఒకరి ఆరోగ్యం విషయంలో నిద్ర పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. నిద్రకు సరిపడినంత సమయం కేటాయించకపోతే సమస్యల బారిన పడాల్సిందే. ముఖ్యంగా, ఆలస్యంగా నిద్రించే వారిలో, నిర్దిష్ట గంటల కన్నా తక్కువ లేదా ఎక్కువ గంటల పాటు ముసుగు తన్ని పడుకునే మగవారికి వీర్యకణాల సంఖ్య బాగా నశిస్తాయట. అలాంటి మగవారి వీర్యంలో ఉండే శుక్రకణాలకు సరైన కదలిక ఉండదని, తద్వారా సంతానం కలిగే అవకాశాల సంఖ్య వారిలో తగ్గుముఖం పడుతుందని తేలింది. చైనాలోని హార్బిన్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.
ఈ పరిశోధన నిమిత్తం కొంతమంది మగవారిని ఎంచుకున్నారు. వారిని రెండు గ్రూపులగా విభజించారు. అందులో ఒక గ్రూప్ ను రాత్రి 8 నుంచి 10 గంటల లోపే నిద్రించమని చెప్పారు. ఆ గ్రూప్ వారు 7 నుంచి 9 గంటలపాటు నిద్రించారు. రెండో గ్రూప్ ను చాలా ఆలస్యంగా నిద్రపొమ్మని చెప్పారు. ఈ గ్రూప్ వారిని ఏడు గంటలకు మించి నిద్రపోకుండా లేపారు. ఆ తర్వాత రెండు గ్రూపులకు చెందిన వ్యక్తుల వీర్యాన్ని పరిశీలించారు. 7 నుంచి 9 గంటల పాటు నిద్రించిన మగవారిలో వీర్యం నాణ్యంగా ఉండటమే కాకుండా, అందులో శుక్రకణాల కదలికలు బాగా ఉన్నాయి.
ఇక రెండో గ్రూప్ విషయానికొస్తే, వీరి వీర్యం నాణ్యంగా ఉండకపోగా, శుక్రకణాల సంఖ్య ఉండాల్సిన వాటి కన్నా 25 శాతం తక్కువగా ఉందని తేలింది. అంతేకాకుండా, ఆ కణాలకు సరైన కదలిక లేదని ఆ పరిశోధనలో తేలింది. ఈ సందర్భంగా పరిశోధకులు కొన్ని సూచనలు చేశారు. సంతానం కావాలని కోరుకునే వారు రాత్రి పూట వీలైనంత త్వరగా అంటే ఎనిమిది గంటల కల్లా భోజనం చేసి, పది గంటల లోపే నిద్రించాలన్నారు. రోజూ ఏడు గంటలకు తక్కువ కాకుండా తొమ్మిది గంటలకు ఎక్కువ కాకుండా నిద్రించే మగవారిలో వీర్య నాణ్యత పెరగడంతో పాటు, శుక్రకణాల కదలికల్లో మార్పు సంభవిస్తుందని, సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.