: తలచుకుంటే పది లక్షల మందిని అక్కడికి రప్పించేవాళ్లం: మంత్రి తలసాని
హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము ఎవరినీ సమీకరించలేదని, తలచుకుంటే పది లక్షలమందిని అక్కడకు రప్పించ గలిగేవాళ్లమని అన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్దని స్థానికులు పదేళ్లుగా కోరుతున్నారని అన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తామంటేనే ఈ రోజు కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారని, ఆందోళనకారులు ఐరన్ పైపులతో అక్కడికి వచ్చారని అన్నారు. విపక్షాల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ను విపక్షాలు ఏకవచనంతో సంబోధించడం దుర్మార్గమని, ఆయన కుటుంబ సభ్యులను ఇలాగే ఏకవచనంతో పిలిస్తే, వారి నాలుకలను ప్రజలు చీరేస్తారని తలసాని మండిపడ్డారు.