: రాజీనామా అనేది చిన్న విషయమా? రాజీనామా చేస్తే హోదా ఎవరు అడుగుతారు?: జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ‘రాజీనామా అనేది చిన్న విషయమా? రాజీనామా చేస్తే హోదా ఎవరు అడుగుతారు? ఒకసారి రాజీనామా చేశాక ప్రత్యేక హోదా గురించి ఎలా మాట్లాడతాం? తెలివిగా ముందుకు వెళ్లాలి. లోక్‌సభ, రాజ్యసభలో ఎవరు ఆ విషయంపై అడుగుతారు? నాలుగు రోజుల ముందు మోదీతో ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడాను.. మోదీ ఏపీకి హోదాపై సానుకూలంగా ఉన్నారు. మంచి జరుగుతుందనే ఆశిస్తున్నా.. రాజీనామా చేయాలంటే ఎప్పుడైనా చేయవచ్చు. పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్ ఉంది.. ఓటింగ్ వస్తుంది.. హోదా గురించి అడగాల్సి ఉంది’ అని జగన్ అన్నారు.
ఒకవేళ ఇవన్నీ జరిగిన తరువాత కూడా హోదా ఇవ్వకపోతే రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా చేస్తామని జగన్ అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోతే ఈ రోజు కాకపోతే ఆరు నెలల తర్వాతయినా రాజీనామా చేస్తాం. టపా టపా ఏ ఆలోచన లేకుండా రాజీనామా చేస్తే మనకే నష్టం.. ప్రత్యేక హోదా గురించి అడిగేదెవరు.. హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తిగా నాకు మంచి పేరు ఉంది. ప్రత్యేక హోదా విషయంలో ఎప్పటికీ వెనుదిరగను. ప్రత్యేక హోదా ఇచ్చేవారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని ఇప్పటికే చెప్పాం. 'పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చారు సార్' అని నేను మోదీతో అన్నారు. ప్రత్యేక హోదాపై శ్రమిస్తూనే ఉంటాను’ అని జగన్ అన్నారు.