: మోదీ ఇప్పుడు మీకు అంటరానివారయ్యారా?: టీడీపీపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
‘నిన్నటి వరకు మోదీ మంచివారని అన్నారు.. ఇప్పుడేమో అపాయింట్ మెంట్ ఎందుకు ఇచ్చారని విమర్శలు చేస్తున్నారు... మోదీ అసలు జగన్ అనే వ్యక్తికి అపాయింట్మెంటే ఇవ్వకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మోదీ మీకు ఇప్పుడు అంటరానివారయ్యారా?’ అని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రజ్యోతి అనే వార్త పత్రిక ఓ లెటర్ చూపించి, అదే లెటర్ ప్రధానమంత్రికి తాను ఇచ్చానని తప్పుడు కథనాలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పేపరు తనపై వార్తలను వండి వారుస్తోందని చెప్పారు. మోదీని జగన్ ఎందుకు కలిశారు? మోదీ ఎందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు? అంటూ టీడీపీ నేతలు ఈ అంశంపైన ఎన్నో విమర్శలు చేస్తున్నారని, అందుకు మీడియా కూడా ఇలా సపోర్ట్ చేస్తోందని అన్నారు.
తాను పీఎంని ఈ నెల 10న కలిశానని జగన్ చెప్పారు. తాను ఆయనతో గంటసేపు మాట్లాడానని, అంతసేపు మాట్లాడితే సాధారణంగా అన్ని విషయాలు చర్చకు వస్తాయని చెప్పారు. తాను పీఎంతో ప్రత్యేక హోదా గురించి 10-15 నిమిషాలు మాట్లాడానని అన్నారు. అగ్రిగోల్డ్ అంశంలో మంత్రులకు ఎలాంటి సంబంధాలున్నాయో కొద్దిసేపు వివరించానని చెప్పారు. తాను ప్రధానిని కలిసిన అంశాన్ని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ అన్నారు. అధికారిక వ్యవస్థను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని జగన్ అన్నారు. వారితో తప్పులు చేయిస్తున్నారని అన్నారు. మరోవైపు గతంలోనే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపి తన నేరం రుజువు కాకుండానే జైల్లో పెట్టించారని, అలా చేయడం తప్పు అని అన్నారు.