: కోదండరాం గారూ.. తెలంగాణను ఆగం చేయకండి: హోంమంత్రి నాయిని విజ్ఞప్తి
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు టీజేఏసీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎన్నో కష్టాలు పడి, త్యాగాలు చేసి సంపాదించుకున్న తెలంగాణను కోదండరాం ఆగం చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు చూసి, ప్రజలు ఇక తమ వెంట రారని ప్రతిపక్షాలకు జ్వరం, దడ వస్తున్నాయని అన్నారు. రైతులకు కరెంటు, నీటి కోసం ప్రాజెక్టులు, ఎరువు, రుణమాఫీ అంటూ ప్రభుత్వం దూసుకుపోతోందని ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. ఇక ఏ అంశంపై పోరాడాలో తెలియక ధర్నాచౌక్ అంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.