: యూపీ అసెంబ్లీలో గందరగోళం...గవర్నర్ పైకి కాగితపు బంతులు విసిరిన విపక్ష సభ్యులు!
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల అనంతరం నిర్వహించిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి. సమావేశం ప్రారంభమైన కొంచెం సేపటికే సమాజ్ వాదీ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. గవర్నర్ రామ్ నాయక్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపైకి కాగితపు బంతులు, పోస్టర్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన మార్షల్స్ తమ చేతుల్లోని ఫైళ్లు, పుస్తకాలతో రామ్ నాయక్ కు అడ్డుగా నిలిచారు.
గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపేసి ‘ఉత్తరప్రదేశ్ మొత్తం మిమ్మల్ని చూస్తోంది’ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా, రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.