: విశాఖ కుంభకోణంలో హవాలాయే కాదు...స్మగ్లింగ్ కోణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది: సీపీ యోగానంద్


వందల కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన వడ్డి మహేశ్‌ కేసులో కీలక అంశాలను విశాఖపట్టణం సీపీ యోగానంద్ తెలిపారు. మీడియా ముందు మహేష్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఫలానా అకౌంట్ల నుంచి తాము భారీ లావాదేవీలను గుర్తించామని, దీని గురించి దర్యాప్తు చేయాలని చెబుతూ తమకు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఫిర్యాదు అందడంతో తాము ఎమ్వీపీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. ఇంటర్‌ వరకు చదువుకున్న మహేష్.. శ్రీకాకుళం, కోల్‌ కతాల్లో ట్రాన్స్‌ పోర్టు బిజినెస్‌ తో పాటు ఉల్లిపాయల వ్యాపారం ఉన్న కోల్ కతాలోని తండ్రి వద్దకు చేరాడని చెప్పారు. దూరవిద్యలో బీకాం పూర్తిచేసిన మహేష్, అక్కడే ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అన్నారు.

తండ్రి వ్యాపార లావాదేవీలు చూస్తూనే.... హవాలా వ్యాపారంలోకి అడుపెట్టాడని గుర్తించినట్టు తెలిపారు. 2014లో తనతోపాటు తన తండ్రి శ్రీనివాసరావు, తల్లి పద్మావతి, పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలిలో ఉంటున్న బంధువులు ఆచంట రాజేశ్‌, హరీశ్‌ లను డైరెక్టర్లుగా పేర్కొంటూ 12 బోగస్‌ కంపెనీలను ఏర్పాటు చేశాడన్నారు. వారిపేరిట 30 బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశాడని, వారిలో కొంత మంది చేత రెండు పాన్ కార్డులు ఇప్పించుకున్నాడని తెలిపారు. అనంతరం హవాలా వ్యాపారులను సంప్రదించి తనకు 12 కంపెనీలు ఉన్నాయని, వాటి ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు. దీంతో ముగ్గురు వ్యాపారులు అతనిని సంప్రదించారని అన్నారు.

విదేశాల నుంచి బేరింగ్ లు, సిగిరెట్లు, కస్టమైజ్డ్ కంప్యూటర్ సేవలు తెప్పించుకుంటున్నామన్న నెపంతో హవాలా ద్వారా భారీ మొత్తం విదేశాలకు పంపి ట్యాక్సులు కట్టిన వీరు...అక్కడి నుంచి తెప్పించుకున్న వస్తువులను తక్కువ ధరలకు లెక్కలు చూపి భారీ మొత్తంలో ట్యాక్సులు ఎగ్గొట్టాడని వెల్లడించారు. ఈ కేసు జాతీయ భద్రతా సంబంధితమైనది కావడంతో నిందితుల పూర్తి వివరాలు వెల్లడించలేమని అన్నారు. ఈ కేసులో కోల్ కతాలోని ముగ్గురు వ్యాపారవేత్తల పేర్లను మహేష్ వెల్లడించాడని అన్నారు.

2014 నుంచి 2017 వరకు మహేష్ జరిపిన వ్యాపార వివరాలు, భాగస్వాముల వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కేసులో అతని బంధువులు రాజేష్, హరీష్ ను విచారణకు పిలిపించామని, వారి జీవన విధానంలో ఎలాంటి మార్పు లేదని, దీంతో వారితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని, మహేష్ వారిని వినియోగించుకున్నట్టు అనిపిస్తోందని తెలిపారు. ఇంతవరకు మహేష్ ను మాత్రమే ప్రశ్నించామని, అతని తండ్రి, ఇతర నిందితులను ప్రశ్నించలేదని తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీని తప్పించుకునేందుకు వీరు ఈ హవాలా వ్యాపారం నడిపించారని ప్రాధమిక దర్యాప్తుల్లో వెల్లడైందని ఆయన అన్నారు. కేసు ప్రాధాన్యత నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును సీఐడీ విభాగానికి దర్యాప్తు కోసం బదలాయిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ డబ్బును విశాఖ, కోల్ కతా మీదుగా చైనా, సింగపూర్, మలేసియా తదితర దేశాలకు తరలించినట్టు విచారణలో వెల్లడైందని, సీఐడీ విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News