: మన అమరావతి దేవతల నగరమే: చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. భవిష్యత్ తరాలకు ఓ అద్భుత, సుందర నగరిని అందివ్వడమే తన లక్ష్యమని, అమరావతిని దేవతల నగరంగా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, సింగపూర్ కన్నా ఉత్తమ నగరాన్ని ఇక్కడ నిర్మిస్తామని తెలిపారు. రాజధాని పక్కనే కృష్ణా నది ఉండటం అదనపు బలమని, నదికి ఇరువైపులా 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకముందని అన్నారు. చాలా తక్కువ సమయంలో సింగపూర్ కన్సార్టియం మాస్టర్ ప్లాన్ ను అందించిందని వెల్లడించారు. వచ్చే పదిహేనేళ్లలో మూడు దశల్లో స్టార్టప్ నగరం తయారవుతుందని, అప్పటికి ఒకటిన్నర లక్షల మంది ప్రజలు, రెండున్నర లక్షల మందికి ఉపాధిని అందిస్తుందని తెలిపారు.