: మొదట తలాక్... ఆ తరువాతే ఎంత మంది భార్యలన్న విషయం: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ముస్లిం సమాజంలో స్త్రీలకు ఎంతో కీడు చేస్తున్న ట్రిపుల్ తలాక్ అంశంపై మాత్రమే వాదనలు వింటామని, బహుభార్యత్వం గురించి చెప్పవద్దని గత వారంలో కీలక రూలింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఓ మెట్టు దిగింది. ప్రస్తుతానికి తలాక్ అంశంపై మాత్రమే వాదనలు విని తీర్పును ఇస్తామని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో బహు భార్యత్వం, నిఖా హలాలా అంశాలను విచారించేందుకు సిద్ధమేనని పేర్కొంది. సమయాభావం కారణంగానే ప్రస్తుతానికి తలాక్ విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.
అంతకుముందు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ, తలాక్ తో పాటు బహు భార్యత్వం, నిఖా హలాల వంటి విషయాల్లో ముస్లిం సమాజంలో గందరగోళం నెలకొందని, వీటిపై తక్షణమే విచారణ జరిపి తీర్పునివ్వాలని కోరింది. దీనిపై పలువురు ముస్లింలు కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ధర్మాసనం తాజా రూలింగ్ ను ఇచ్చింది. కాగా, ఈ కేసును చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. కేంద్రం తరుపున హాజరైన అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ వాదిస్తున్న సంగతి తెలిసిందే.