: సైబర్ దాడికి అమెరికాయే కారణం: విరుచుకుపడ్డ మైక్రోసాఫ్ట్
గత రెండు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులకు అమెరికా ప్రభుత్వమే కారణమని సాఫ్ట్ వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మండిపడింది. ఈ దాడులకు కారణమైన హ్యాకింగ్ టూల్ ను ఆమెరికానే తయారు చేసిందని, ర్యాన్సమ్ వేర్ ను రూపొందించిన అమెరికా కేంద్ర నిఘా సంస్థ, దాన్ని సరిగ్గా దాచుకోలేకపోయిందని, భద్రతా వ్యవస్థలోని డొల్లతనమే ఈ టూల్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లేలా చేసిందని ఆరోపించింది.
గత నెలలోనే ఇది ఆన్ లైన్లో లీక్ అయిందని సంస్థ ప్రతినిధి బ్రాడ్ స్మిత్ తన బ్లాగ్ లో వెల్లడించారు. ప్రభుత్వ సాఫ్ట్ వేర్ దుర్బలత్వం కారణంగానే వందలాది సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. యూఎస్ సెంట్రల్ ఏజన్సీ వేలాది హ్యాకింగ్ టూల్స్ డెవలప్ చేసి ఎన్నో దేశాలపై నిఘా పెట్టినట్టు గతంలోనే వికీలీక్స్ వెల్లడించిందని గుర్తు చేసిన ఆయన, వారి నిర్లక్ష్యంతోనే తమ కస్టమర్లు నష్టపోయారని, ఇప్పటికైనా యూఎస్ ప్రభుత్వం మేల్కొనాలని హితవు పలికింది. కాగా, ఈ కామెంట్లపై వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు.