: 'బాబా ముద్ర' రజనీ అభివాద సింబల్!
కొద్దిసేపటి క్రితం చెన్నై రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీకాంత్, తన అభిమానులతో సమావేశం కాగా, సమావేశానికి వచ్చిన తమ అభిమాన నటుడికి ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. బాబా చిత్రంలో రజనీ చూపించే తనదైన ముద్రను చూపుతూ అభిమానులు కోలాహలం చేశారు. నల్లటి దుస్తుల్లో వేదిక నెక్కిన ఆయన వెంట సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఒక్కరే ఉన్నారు. ఇద్దరూ నల్లదుస్తులతోనే సభకు వచ్చారు.
రజనీతో 30కి పైగా చిత్రాలను తీసిన ముత్తురామన్, ప్రారంభోపన్యాసం చేస్తూ, అభిమానులే రజనీకి ఉన్న అపారమైన బలమని వ్యాఖ్యానించారు. రజనీలో ఉన్న నిబద్ధతను తాను మరే నటుడిలోనూ చూడలేదని, అదే నిబద్ధత అభిమానుల్లోనూ కనిపిస్తోందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇది అభిమాన సంఘాలతో భేటీయేనని, రాజకీయ కోణంలో చూడవద్దని అన్నారు. ఇక రజనీ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే బొటన వేలితో మడిచి ఉంగరం వేలు, మధ్య వేలును పట్టుకుని చూపుడు వేలు, చిటికెన వేలును పైకి ఎత్తి ఉంచే చేతి సంజ్ఞే ఆయన అభివాద చిహ్నం కానుందని తెలుస్తోంది.